Friday, April 24, 2015

గాయత్రి దండకము

తల్లీ! జగత్కల్ప వల్లీ! చిదానంద వల్లీ! సుధారాగవల్లీమ తల్లీ! త్రివర్ణ స్వరూపా! త్రయీపాదరూపా! త్రిసంధ్యాస్వరూపా! త్రిమూర్త్యాత్మరూపా! త్రినేత్రా! ప్రసాదించవే తల్లీ;
తద్రూపిణీ! దివ్య సద్రూపిణీ! వేద విద్రూపిణీ! తుర్య భాగ్రూపిణీ! వర్య వాగ్రూపిణీ! పూరకుంభస్వన ద్రేచకోద్భాసినీ! నీలవేణీ! యతీంద్రాదిహృత్పద్మ సంచారిణీ! భాస్కరీ! భవ్యగోలోకసంచారిణీ! దేశకాలానురూపా! వషట్కారరూపా! సదాచారరూపా! మహధీరగంభీరరూపా! మహామంత్రరూపా! హితారాధ్యరూపా! సుధీశాలినీ! యొగమాయా విలసోల్లసద్రూపిణీ! యొగి యొగేశ్వరారాధితా! నామపారాయణప్రీత హృత్పద్మినీ! ప్రాణసంజీవనీ! సత్యధీచోదినీ! ధర్మదాక్షిణ్యరూపా! యధాశక్తినర్చింతునోయమ్మ! ,
త్వత్పాద కంజాత ధూళిన్ శిరంబందు మేనన్ గుభాళింపగా చల్లుకొందున్ శుభశ్రీలతో నిండుకొన్నట్టి ప్రత్యూష సౌందర్య సంపత్తి చిత్తంబులో హత్తుకొందున్ తమోహారిణీ!
స్వాగతంబమ్మ తేజస్వినీ!
అగ్నియే మోముగా, బ్రహ్మశీర్షంబుగా, విష్ణుదేవుండుడెందంబుగా, రుద్రుడే కేశపాశంబుగా, భూమియే యోనిగా, పంచప్రాణంబు లొప్పన్, శరత్పూర్ణిమా, జ్యొత్స్నవై, చారు భూషాంగివై, వేద శాఖోపశాఖాదు లందాడుచున్ నృత్యముం జేయవే;
సామవేదోక్త, మాధ్వీక, విద్యాప్రభావంబులో, వర్ణితంబైన, నీ, రోహిత, శ్వేత, కృష్ణాతికృష్ణ, స్వరూపంబులున్, చంచలత్తేజమున్నోలి, వస్వగ్ని, రుద్రేంద్ర, పాశాయుధాదిత్య, రాజన్మరుత్సోమక, భ్రహ్మసాధ్యుల్, సదా పానముంజేయగ, వారినానంద పాధొధిలో దేల్చి, పూర్ణాత్ములం జెయవే, అట్టివారిన్ దొసంగుల్ తొలంగన్, స్మరింపంగ శక్తిన్ ప్రసాదింపవే, వేదమాతా!
పృధివ్యగ్ని, వాయ్వంతరిక్ష, స్వరాదిత్య, శుభ్రాంశు నక్షత్ర వాక్ప్రాణ, చాయాత్మచక్షుస్సులున్, శ్రోత్ర చిత్తంబులున్ నేత్ర కృష్ణాచ్చవర్ణంబులున్ సామరూపంబులై కొల్వ ప్రాణస్వరూపాధి దైవంబవై సామగాయత్రివై, సాధుభావంబుతో, లోకవిఖ్యాతి జేకొన్న మా తల్లి పూతాత్మునిం జేయవే నన్ను -
వాగ్రూపమై, నామరూపక్రియాభేదమై, భూతసంబంధియైనట్టి ఈజంగమ స్థావరాలంకృతం, బీప్రపంచంబు, వాక్సారమై శాబ్దికంబైన బ్రహ్మంబుగానొప్ప తద్బ్రహ్మ వేదోక్త గాయత్రిగా కీర్తినందన్, భవద్వ్యాపితానంత, శక్తిన్ ప్రపంచంబు పూరించుచున్, సర్వభూతాత్మకత్వంబుగా, పృధ్విరూపంబుగా నొప్పి త్వన్మంత్రమున్ గానముంజేయు భక్తాళి రక్షించుచున్ సార్ధకంబైన గాయత్రి నామంబునుం దాల్చి పేర్వడ్డ నీరూపు భావింతు నీనామసామర్ధ్య మూహింతు;
సూర్యోదయంబందు బ్రత్యగ్రరూపంబుతో రక్తపద్మాసనారూఢవై, రక్తవస్త్రంబులం దాల్చి రక్తాంగివై రక్త మాలా సుగంధాను లేపంబులంగూడి ఋగ్వేదమున్ పూని దండాక్ష మాలాదులున్, న్రు క్సృవంబుల్ చెలంగన్ ప్రసన్నాత్మతన్ బాలగాయత్రిగా బ్రాహ్మి రూపంబుతో నాల్గుమోముల్, సదా, నవ్వులన్, రువ్వగా రాజహంసంబుపైవచ్చు, నీ తేజమున్ గొల్తు.
అర్ధొదయంబందునన్, నీదు దివ్యారుణ జ్యొతికిన్ చిత్తముప్పొంగ మేనన్ గగుర్పాటు వ్యాపింప రాగామృతా స్వాదనాయత్త, భృంగమ్మునై, చొక్కుదున్ మ్రొక్కుదున్ మక్కువన్ తల్లిరోయిమ్ము సద్బుద్దినోయమ్మ.
మద్యాహ్న కాలంబులో నీవు శ్వేతాంగివై, శ్వేత వస్త్రంబులం దాల్చుచున్, శ్వేతపద్మాసనంబందు, శొభిల్లుచున్ ప్రౌఢవై, యాజుషంబైన గ్రంధంబు చేబూని నేత్రత్రయంబొప్ప పంచాస్యవై, గంధమాలాదులొప్పన్, త్రిశూలంబుతోడన్, వృషారూఢవై, దివ్యదీప్తిన్ ప్రచండప్రభాదుర్నిరీక్ష్యంబుగా, నొప్పవే తల్లి, రుద్రాది దైవంబవైనట్టి నీరూపు భావింతు సాద్గుణ్య సామ్రాజ్య సావిత్రి సత్కీర్తికై నిన్ను సేవింతునోయమ్మ.
అస్త్రాద్రి తాకంగ సూర్యుండు నీవంతటన్ కృష్ణ వర్ణంబుతో కృష్ణపద్మాసనారూఢవై కృస్ణవస్త్రంబులం దాల్చి నేత్రద్వయంబొప్ప దండాక్షమాలాదులన్ శంఖచక్రాదులన్ తాల్చుచున్ సామవేదంబుతో వృధరూపంబుతో విష్ణుభావంబు తళ్కొత్త తార్క్ష్యుండు, వెన్నంటిరా, దివ్యనక్షత్ర కోటీ ప్రభాసమానాంగివై, చారుభూషాంగివై వాణివై నీణ చేబూని వీణాఖ్యలోకంబు నందుండి, ఆలాపముల్ చేయ, తన్నదముల్, మౌనిలోకంబులందాకి, వేదంబులైక్రాల గంధర్వలోకంబు గాంధారమున్ పాడ మెచ్చన్ దిశాశ్రేణులన్ తట్టుచున్ లోకముల్ ముట్టి శబ్దంబులన్ పుట్టగా జేయుచున్ నాదవిఖ్యాతవై సాంధ్యవౌచున్ సరస్వత్యభిక్యాతవై తోచు కల్యాణిరో యిమ్ము సంగీత సాహిత్య సద్భావసంపత్తి నో తల్లి!
పాతాళ లోకంబు నందుండి జీమూత భూతంబువోలెన్ తమంబల్లనన్ స్వర్గలోకంబు పైకొన్న నక్షత్రగోళంబులన్ చంద్రుడున్ స్వీయతేజంబులన్ సూర్యబింబాకృతిన్ దాల్చిరేమోయనన్ వచ్చి భానుండు సప్తాంశు బాణాగ్నులన్ రువ్వ తానంతటన్ కొండలన్ బండలన్ దూఱి కాలంబుకై నిల్చి బాణప్రతాపంబు నిర్వీర్యముం జేయుచున్ సూర్యబింబంబుపైబడ్డ భానుండు తేజంబు నక్షత్ర చంద్రాదులందుంచి కాలంబుకై నిల్వ దైవాసురంబైన యుద్ధంబు నిత్రంబుగ సంధిలన్ సంధ్యలో మౌని లోకంబు, ధీశాలినీ! నీవిలాసంబు, నీవిభ్రమావిర్భవం బెంచుచున్ మానసంబందు నీశక్తికిన్ యుక్తికిన్ మెచ్చుచున్ స్తొత్రపాఠంబులం జేయుచున్ మ్రొక్కదే, ఆత్మచైతన్య, విస్పారితా లోక, నానంతశక్తిన్ మహాదేవి కైమోడ్పులో తల్లి;
భాస్వత్కిరీటాం, మహాకుండలై ర్మండితాం, శంఖ చక్రాంకహస్తాం, స్పురత్కాంతిరూపాం, ఉదూఢద్యుతిం, శ్యామలాం, కోమలాం, సుందరీం, చంద్రతారాత్మికాం, నిత్యసత్యాత్మికాం, మోహినీం, సర్వమంత్రాశ్రితాం, శుద్ధవిద్యాం జయాం జ్ఞానరూపం తమోహారిణీం వేదధాత్రీం, ఉషకాల గమ్యాం, ఉదాత్తస్వరూపం, సదాహంసయానాం, అజేశాదివంద్యాం, సుమేధం దదానాం సుశాంతాం సుకాంతాం శుభాం నిత్యమైశ్వర్య సౌఖ్యప్రదం, శాకినీ, డాకినీ ఘోర భూతాళి విద్రావిణీం త్వాంభజేయంచు నిన్ కొల్తు రెవ్వార లవ్వారి పాపంబులం ద్రుంచి కష్టంబులన్ పాపవే తల్లి.
ఈ జీవిపై నీదయావర్షమున్ చిమ్మవె ముక్తి మార్గంబు చూపింపవె దోషపుంజంబులన్ ద్రుంపవే నింపవే దివ్య భావంబుతో నామనంబున్ సదా మ్రొక్కెదన్ తల్లిరొ వేదమాతా!
నమెస్తె, నమెస్తె, నమెస్తె నమహ
శ్రి గాయత్రీ పరబ్రహ్మార్పణమస్తు.

3 comments:

Unknown said...

గాయత్రీ పరబ్రహ్మార్పణమస్తు
అంతా శుభం కలుగు గాకa

GARAM CHAI said...

blog chaLa bagundhi...
Hi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support https://www.youtube.com/garamchai

Movie Masti said...

good afternoon
its a nice information blog
The one and the only news website portal INS Media.
please visit our website for more news updates..

https://www.ins.media/